Thursday 9 April 2015

రిజర్వేషన్లు వాటి బాధ్యత




ఠిజర్వేషన్లు ఒక బాధ్యత - ఒక కర్తవ్యం :
1. రిజర్వెషన్ల లక్ష్యం అస్పృష్యతా ప్రవాహం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలను రక్షించి ఒడ్డుకు చేర్చడం.
2. రిజర్వేషన్ల లక్ష్యం అస్పృష్యతా నిర్మూలన. కుల నిర్మూలన, కులరహిత సమాజ స్థాపన.
3. ఈ లక్ష్య సాధనకు అంబేద్కరిజం పునాదిగా ఒక మాతృ సంస్థ, సమతా సైనిక్ దళ్' ను గుర్తించి ఆ సంస్థ క్రింద ఉద్యమించడం.అంబేథ్కర్ సంఘాలన్నీ కూడా సమతాసైనిక్ దళ్ కు అనుబంధ సంస్థలుగా రూపొందేందుకు కృషి చేయడం.రిజర్వేషన్లు పొంది ప్రతి వ్యక్తిని ఈ మాతృ సంస్థను ప్రజాస్వామ్య పద్దతి లో సక్రమంగా, పటిష్టంగా సమర్థవంతంగా నడిపించడం.
4.
రిజర్వెషన్లు పొందిన ప్రతి వ్యక్తి సంపాదనలో కనీసం 1% సంపాదనసు మాతృసంస్థకు బాధ్యతగా స్వచ్చందంగా చెల్లించి రశీదు తీసుకోవడం.
5. షెడ్యూల్డు కులాలను అస్పృశ్యతను వదిలించుకునేందుకు, కులరహిత సమాజం నిర్మంచుకునేందుకు ఎడ్యుకెట్, ఎజిటెట్ కార్యక్రమంతో ఆర్గనైజ్ చేయడం. ఇందు కొరకు గ్రామ గ్రామం లో అంబేథ్కరిజం ప్రచారం చేయడం. ఇందుకు ఫుల్ టైం కార్యకర్తలను ఏర్పాటు చెయడం.
6. స్కూళ్ళను, కాలేజీలను ఏర్పాటు చేయడం(పీపుల్స్ ఎడ్యకెషన్ సొసైటీ).
7. ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయడం.
8. గ్రామీణ షెడ్యూల్డు కులాలకు ఆర్థిక, సాంఘిక, పోలీసు, న్యాయ విషయాలో వారికి చేయూతనిచ్చి వారి జీవన పరిస్థలను మెరుగు పరచడం.
9. ప్రతి షెడ్యూల్డు కులం కుటుంబాలకు రిజర్వెషన్లు అందేలా కార్యక్రమాలు రూపొందించుకోవడం.
10. అస్పృష్యతను, కులవ్యవస్థను నిర్మూలించేందుకు షెడ్యూల్డు కులాలను ఒక నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా రూపొందించడం.
11. అస్పృశ్యతను, కులవ్యవస్థను నిర్మూలించుకొనేందుకు గాను హిందువలను కన్వన్స్ చేసి కులరహిత సమాజం వైపు నడిపించేందుకు మేధావి వర్గాన్ని రూపొందించుకోవడం. ఉద్యమ న్యాయకత్వాన్ని తయారు చేసుకోవడం.
12. షెడ్యూల్డు కులాలులో సైతం కొనసాగుతున్న బ్రహ్మన సంస్కృతి, మనుసంస్కృతి, కులతత్వం, సంకుచితత్వాలను వదించుకొనేందుకు కా్రయక్రమాలను రూపొందించుకోవడం. షెడ్యూల్డు కులాలు మధ్య స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం, సామరస్యం, ఐక్యత, సంఘటిత భావనలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం.
13. అస్పృష్యత నిర్మూలనకు, కుల నిర్మలనకు రజ్యాంగ ప్రకారం ప్రభుత్వం పై వత్తిడి తీసుకు రావడం.
14. రిజర్వేషన్లు సౌకర్యాలు కాదు బాధ్యతలు, కర్తవ్యాలు అన్న వాస్తవాన్ని షెడ్యూల్డు కులాలకు బోధించడం.
15. షెడ్యూల్డు కులాల్లో ఆత్మగౌరవ స్పృహ పెంపొందించడం.
--పై వాక్యాలు "అంబేద్కర్ ద ట్రూ పేట్రియాట్ అంబేద్కరిజం ది ట్రూ పేట్రియాటిజం" పుస్తకం నుంచి సేకరించడం జరిగింది
దళిత ఉద్యోగుల బాధ్యత:
రిజర్వేషన్ ఉపయోగించుకొని సంపాదించిన ప్రతి ఒక్క లబ్ది/ప్రయోజనం వెనుక ఉన్న భాద్యత కు ఒక లెక్క ఉంది. అది వెరీ సింపుల్ మేథమేటిక్స్, నువ్వు ఏ జాతి పేరు చెప్పుకొని పైకొచ్చావో, ఆ జాతికి, నువ్వు పొందిన ప్రయోజనం తాలూక, స్కేల్డ్ యూనిట్స్ సరిపడా సేవ చేసి, ఆ జాతి అభ్యున్నతి కి పాటు పడి, "ఛ! ఏంటి! ఇంకా ఈ రిజర్వేషన్లు, వీటిని రద్దు చేయాలి" అనే స్థాయికి, ఆ జాతి ని పైకి తీసుకు రావాలి. అదీ లెక్క. ఈ లెక్క ను ఏ చిన్న పిల్లాడు కి చెప్పినా, "లాజిక్ ఉంది" అంటాడు.
అలా చెయ్యక పోతే, ఈ రిజర్వేషన్లకు మూల కారకులు, అనేక అవమానాలు, వెతలు గురి కాబడి, ఎటువంటి లబ్ది పొందని మన తాత ముత్తాత ల ఆత్మలు ఘోషిస్తాయి. ఆ ఘోష యొక్క శాపాలు, శాపనార్దాలు, జాతికి పే-బ్యాక్ చేయని, రిజర్వేషన్ వలన లబ్ది పొందిన వ్యక్తుల పిల్లలు, పిల్లల పిల్లల పై భయంకరమైన ప్రభావం చూపిస్తాయి. ఇలా అనటం లో కూడా, ఒక లాజిక్ ఉంది., "ముత్తాత, ముత్తాత ల పిల్లల పిల్లల పిల్లలే ఒక కులం. ఒక జాతి." ఆ మొత్తం జాతి అభివృద్ధి జరిగితేనే, ఆ ముత్తాతల త్యాగానికి అర్ధం, పరమార్ధం. ఇది మేథమేటిక్స్ కాదు., ఇదీ సైన్స్.
కాబట్టి ఫ్రెండ్స్!, మన జాతి, దాని అభ్యున్నతి కోసం మనం చెయ్యాల్సిన సేవ ఏమీటి? అది ఎలా ఉండాలి?
v  ఉద్యోగం వచ్చి, నిలదొక్కున్న వెంటనే, ప్రతి నిత్యం, నేను, నా పిల్లలు అని మాత్రమే కాకుండా, మన నిమ్న కులం లోనే తినడానికి తిండి కూడా లేని వాళ్ళు ఉంటూ, మంచి నాలెడ్జ్ మాత్రం కలిగి ఉండే పది సంవత్సరముల వయసు లోపు పిల్లలను గుర్తించి, వారికి అయ్యే విద్య, వైద్య పోషణ ఖర్చులు భరిస్తూ, వాళ్ళు జీవితం లో బాగా పైకి వచ్చే మార్గం చుపించి, వాళ్ళు సెటిల్ అయ్యే వరకు, ఆ సహాయం చెయ్యాలి. వీలయితే దత్తత తీసుకోవాలి. "ఈచ్ వన్ క్యాచ్ టెన్"
v  కుల వివక్ష ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని స్టేజిల మీద మాటలతో తృప్తి పడకుండా, చేతలలో, దగా పడ్డ నిమ్న జాతి బిడ్డలకు "నేనున్నాను" అనే భరోస కలిపించాలి. అయితే, ఇక్కడ చేతల లో సహాయం చెసేవాడు మాత్రమే, స్టేజిల మీద, ముఖ పుస్తకముల లో మాట్లాడవచ్చు.
v  మీ వృత్తిని బట్టి నిమ్న జాతి బిడ్డలకు సహాయం చెయ్యవచ్చు. ఒక వైద్యుడు, ఉచిత వైద్యం అందించ వచ్చు. ఒక లాయర్ ఉచిత న్యాయ సేవ చెయ్యవచ్చు. నేను, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ఠ లో శిక్షణ కేంద్రములో ఒక ట్రైనర్ గా చేస్తున్నాను. లెక్చరర్ గా అపార అనుభవం గడించాను. అందుకే, నా ఓన్-హౌజ్ పై ఒక ఉచిత శిక్షణ సంస్థ ను మూడు లక్షలు ఖర్చు చేసి నిమ్న కుల ఉద్యోగార్ధులకు కోచింగ్ ఇస్తూ, సంవత్సరంనర కాలంలో అయిదు బ్యాచ్ లను తయారు చేసాను. ఇద్దరికి ఉద్యొగములు వచ్చాయి. సంస్థ పేరు : "ఇన్స్పైర్". ఎందుకంటే, మన ఫ్రెండ్స్ అందరికి స్ఫూర్తి అవ్వాలి.
v  మన నివాసం దగ్గరిలో ఉన్న సంక్షేమ హాస్టల్ లకు వెళ్ళి, అక్కడి విద్యార్ధులకు పుస్తకములు, బట్టలు కొని ఇవ్వడం, లేదా, ఉచిత విద్య, స్పోకెన్ ఇంగ్లీష్ వంటివి భోదించటం.
v  పేద, నిమ్న కుల విద్యార్ధి ని ఎన్నుకొని, అతనిని నెల, నెలా మా ఇంటికి వచ్చి, నీ ఖర్చుల నిమిత్తం, నెలకు రూ.500/- ఇస్తానని చెప్పి, అది ఒక క్రమం తప్పకుండా ఆర్ధిక సహాయం చేయడం.
v  మన నిమ్న కులస్థులందరూ సహజంగా ఊరికి దూరంగా, ఒకే చోట జీవిస్తూ ఉంటారు. అక్కడే, ఒక ఇంటి లో చిన్న ఉచిత ట్యూషన్ పాయింట్ నిర్వహిస్తూ, క్రమం తప్పకుండా, వాళ్లని వృధి లోకి తెచ్చుకోవటం.
v  రిజర్వేషన్ ఒక సారి వాడుకొని పైకొచ్చిన తరువాత, తన పిల్లలకు రిజర్వేషన్ పెట్టుకోకుండా, మన సోదర నిమ్న జాతి పేద వారి బిడ్డలకు అవకాశం కల్పించాలి. పిల్లల విషయం లో త్యాగం చేయలేక పోతే. కనీసం, తన వ్యక్తిగతంగా, జీవితం లో ఒక సారి వాడుకున్న రిజర్వేషన్ ను మళ్ళి, మళ్ళి వాడుకొనే అలవాటును త్యాగం చెయ్యాలి.
v  రిజర్వేషన్లను ఎడా, పెడా వాడేసుకొన్న ఈ విషయం లో గుర్తుకొచ్చేది, జి.వెంకటస్వామి, వివేక్, వినోద్ లు మరియు కాకి మాధవ రావు, ఒక అమ్మాయి ఐ.ఏ.యస్., మరొక అమ్మాయి డాక్టర్, ఇద్దరు అళ్ళుళ్ళు ఐ.ఏ.యస్. బాబు జగజ్జివన్ రామ్ ఫేమిలి లో షుమారు 12 ఐ.ఏ.ఎస్./ ఆల్ ఇండియ సర్వీసెస్ అధికారులు ఉన్నారు. రిజర్వేషన్లు ఇంత స్థాయి లో ఉపయోగించుకోవడం అవసరమా?
v  రిజర్వేషన్ ఉపయోగించుకొని పైన చెప్పిన పే-బ్యాక్ పనులేమి చేయకుండా, న్యూట్రల్ గా ఉంటే కొంతవరకు పరవాలేదు. ఇంకొంత మంది, రిజర్వేషన్లను ఎడా, పెడా వాడేసుకొని, ఇప్పుడు తన కులమే డిస్క్లోజ్ కాకుండా, మన నిమ్న జాతి బిడ్డలకే అన్యాయం చేసే కొంత మంది వెధవల గురించి..
v  రిజర్వేషన్ లో బి.ఇ./బి.టెక్. చేసి సాఫ్ట్ వేర్ వంటి ప్రైవేట్ జాబ్ చేస్తూ, నాకు రిజర్వేషన్ ఎప్పుడు ఉపయోగపడ్లేదు. నా టాలెంట్ మీద నే నా జాబ్ వచ్చిందని పెద్ద ఫోజ్ కొడుతూ ఉంటారు. రిజర్వేషన్ లో చదివిన విద్య అనే పునాది లేకుంటే, ఆ జాబ్ వచ్చేది కాదని పెద్దగా వాళ్ళ చెవి దగ్గర అరిచినా, చెవిటి వాళ్ళగా నాటిస్తారు, జీవిస్తారు.
v  రిజర్వేషన్ లను ఉపొయోగించుకొని, పైకొచ్చి, ఉద్యోగ సంఘాల నాయకులై, కేవలం అగ్ర కుల ఉద్యోగులకే సముచిత సేవలు చేస్తూ., పాపం కూడ బెట్టుకుంటున్నారు. కొందరయితే, రాజకీయాల్లోకి వచ్చి, తన పిల్లల తరం, తరువాత తరం, ఆ తరువాత తరం ఇదే ప్రస్తావన,స్తుతి.
v  రిజర్వేషన్ లను ఈ తరం లో ఉపయోగించు కోక పోయినా, నాన కు రిజర్వేషన్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టే, నేను ఇట్లా ఉన్నా, అని మరిచి పోయి, కులం పేరు కూడా చెప్పుకోలేని వెధవలు ఇప్పటికి ఉన్నారంటే మీరు నమ్ముతారా?
v  పైన చెప్పిన విషయాలన్నింటిని క్రోడీకరించి, మనం ఒక కంక్లూజన్ కు రావచ్చు. అదేమిటటంటే " మనం రిజర్వేషన్ ఉపయోగించుకొని మన జాతి బిడ్డలను పైకి తెచ్చే ప్రక్రియ ఆరంభించకపోతే, రిజర్వేషన్ వ్యతిరేఖ అగ్రకుల కొన్ని వ్యక్తుల జిత్తులు సఫలం చేసే ప్రమాదం ఉంది. రిజర్వేషన్ ను పూర్తిగా రద్దు చేయటానికి కారకులమయ్యే ప్రమాదం ఉంది.



దళితులు – అస్తిత్వం:
ఎవరి దగ్గరైతే భూములు ఉత్పత్తి సాధానాలు ఉంటాయో వాళ్ళంతా ఒక(దోపిడీ) వర్గం. అవి ఏమీ ఉండక శారీరక శ్రమలు, మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసేవాళ్ళంతా ఒక విభాగం(ఇందులో దళితులే ఎక్కువ భాగం ఉన్నారు). మేధా శ్రమలు చేసే వాళ్ళంతా ఒక భాగం. రొండు కలిపి ఒక వర్గం(దోపిడీ చెయ్యబడే వర్గం). దళితులను హీనమైన శ్రమలు చేసే వాళ్ళుగా చూడటం ప్రారంభించి అది చివరికి ఒక మూఢాచారంగా నిలిచి పోవటం దాని వల్లే ఇదివరకు వాళ్ళు చాలా కష్టాలు అనుభవించటం అనేది 100% నిజం. పోరాటాల వల్ల ఇప్పుడు కొంత మారిన మాట వాస్తవం. అయినా వారి దగ్గర భూములు, ఉత్పత్తి సాధనాలు లేనంత వరకూ వాళ్ళ కష్టాలు మొత్తం తీరేవి కావు. దానికి వర్గ పోరాటం చెయ్యాల్సిందే. నా అవగాహన ప్రకారం చెప్పాను.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల పరిశీలన;
ప్రయివేటులో రిజర్వేషన్లకు చట్టం అవసరనం...
ప్రభుత్వ రంగంతోపాటు, ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ ఛైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ అన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల కల్పనకు చట్టం అవసరమని చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్టు (సిపిఐ-ఎం) రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా 'ప్రయివేటు రంగం - రిజర్వేషన్లు'అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్థిక విశ్లేషకులు అందె సత్యం అధ్యక్షతన సెమినార్‌ జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన సుఖ్‌దేవ్థోరట్‌ సెమినార్‌నుద్దేశించి మాట్లాడుతూ పేదరికంలో, ఆకలిలో, నిరక్షరాస్యతలో, నిరుద్యోగంలో, తక్కువ కూలి పొందడంలో, భూమిలేనివారిలో, ఉపాధి అవకాశాలు లేకపోవడంలో దళితులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. దళితేతరుల కంటే దళితులు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారని తెలిపారు. దళితేతరులు ఆర్థిక పరమైన వివక్షను మాత్రమే ఎదుర్కొంటారని, దళితులు ఆర్థిక, సామాజిక వివక్షతను ఎదుర్కొంటారని వివరించారు. 1936లోనే బిఆర్‌ అంబేద్కర్‌ సామాజిక వివక్షతను, ఆర్థిక అసమానతలను గుర్తించారని చెప్పారు. నేటికీ ఆర్థిక అసమానతలతోపాటు సామాజిక వివక్ష కొనసాగుతోందని తెలిపారు.
 పంజాబ్‌లో 30 శాతం మంది దళితులుంటే, వారిలో 95 శాతం మందికి భూమి లేదన్నారు. దీంతో దళితులకు కొన్ని స్కూళ్లలో ప్రవేశం లేదని, భూమి కొనడానికి అవకాశం లేదని, పౌష్టికాహారం అందడం లేదని, ఉపాధి దొరకడం లేదని వివరించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగాలంటే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఆర్థిక, సామాజిక సమానత్వంతోనే వివక్షత రూపుమాపబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌, విద్యావైద్యం జాతీయీకరణ చేయాలని అంబేద్కర్‌ చెప్పినా అమల్లోకి రాలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చాక రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని, దళితుల రక్షణకు చట్టాలొచ్చాయని తెలిపారు. ప్రభుత్వరంగం రోజురోజుకు తగ్గిపోతోందని చెప్పారు. ప్రయివేటురంగం విస్తరించిందన్నారు. అందుకే ప్రయివేటురంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.



v  ప్రభుత్వం రంగం హరించుకుపోతున్న దశలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగానికే పరిమితమయితే లాభం లేదు. ప్రభుత్వరంగంలో రిజర్వేషన్లు న్యాయసమ్మతమే అయితే ప్రయివేట్‌ రంగంలోనూ అవి న్యాయ సమ్మతమే. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుందని, మార్కెట్‌లో పోటీని తట్టుకోలేమని చేసే వాదనలకు ఎలాంటి అర్ధం లేదు.
వేల సంవత్సరాలుగా మన సమాజంలో రిజర్వేషన్లు అమలయ్యాయి. వర్ణవ్యవస్థ స్థానంలో కులవ్యవస్థ క్రమంగా ప్రవేశించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నా వేల సంవత్సరాల నాటి రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాతుర్మర్ణం మాయ సృష్టం అంటూ దేవుడిపేరు చెప్పి రిజర్వేషన్లను శాస్త్ర బద్దం చేశారు. ప్రశ్నించ వీలులేని అంశంగా మార్చారు. బ్రాహ్మణులకు చదువు సంధ్యలు, చదువు సంధ్యలతో కూడిన పనులు రిజర్వ్‌ చేశారు. క్షత్రియులకు సంరక్షణ, వైశ్యులకు వ్యాపార వ్యవసాయాలు, శూద్రులకుపై ముగ్గురికి ఊడిగం చేసి బతికే పనిని రిజర్వు చేశారు. రిజర్వేషన్‌ అమలు కోసం కర్మసిద్ధాంతం సృష్టించారు.
v  వేల సంవత్సరాల పాటు సాగిన ఈ రిజర్వేషన్లు అన్ని రంగాల్లో తీవ్ర అసమానతలను సృష్టించాయి. ఆ అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వేల సంవత్సరాల నుండి అమలయిన అసమానతలను తొలగించడానికి భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు, దానికి ముందు కొందరు రాజులు తమ రాజ్యాల్లో దళితులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ ఆశించిన మార్పులు ఇప్పటికీ రాలేదు. విద్యా, ఉద్యోగాల్లో అమలయిన రిజర్వేషన్ల వల్ల సామాజిక అంశాల్లో కొన్ని మార్పులు సంభవించినప్పటికీ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఆస్తిపాస్తుల్లో ఉండే అసమాతలు తొలిగిపోలేదు. అసమానతలు పూర్తిగా తొలగని విషయం గమనించడం ఎంత అవసరమో రిజర్వేషన్లు తెచ్చిన సామాజిక మార్పులను కూడా గమనించడం అంతే అవసరం.
v  ఒకవేళ భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అమలు చేసి ఉండకపోతే ఇప్పుడు మనం చూస్తున్న అనేక మార్పులు ఖచ్చితంగా జరిగి ఉండేవి కావు.
రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాల నేపథ్యంలో చాలా కాలం నుండి అగ్రకులాల వారి మధ్య స్వాతంత్య్రానికి ముందు నుండి కూడా కులాంతర వివాహాలు కన్పిస్తాయి. కులం, భాష ప్రాంతం, మతం వంటి పరిధులను దాటుకొని జరిగిన పెళ్లిళ్లు మనకు చాలానే కన్పిస్తాయి. గాంధీజీ, రాజాజీ, పండిటీజీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే అవుతుంది. కులవ్యవస్థపై పోరాటంలో ముందుపీఠిన ఉన్నారు కనుక ఈ పరిధులను లెక్కచేయకుండా పెళ్లి చేసుకున్న కమ్యూనిస్టుల ప్రస్థావన ఇక్కడ చేయడం లేదు. అలాగే రాజకుటుంబాలకు సంబంధించిన వారి మధ్య కుల, భాషా, మత పట్టింపులు లేకుండా జరిగిన అనేక పెళ్లిలను మనం చూడవచ్చు.
v  ఇవి చాలావరకు అగ్రకులాల మధ్య జరిగిన పెళ్లిళ్లు కాగా అగ్రకులాలకు ప్రస్తుత శూద్రకులాలకు మధ్య జరిగిన పెళ్లిళ్లు బహు అరుదు. పెళ్లిళ్లలో ఇప్పటికీ ఆర్థిక స్థితి అన్నది ప్రధాన అంశమే. అయినప్పటికీ అగ్రకులాలకు శూద్రులకు మధ్య శూద్రుల్లోని వివిధ కులాల మధ్య జరుగుతున్న పెళ్లిళ్ల సంఖ్య ఇప్పుడు పెరుగుతున్న విషయం మనం చూడొచ్చు. రిజర్వేషన్లను అమలు చేయకుండా ఉంటే ఈ మాత్రం మార్పు జరిగి ఉండేదా? కులాంతర పెళ్లిళ్ల పట్ల ఇప్పటికీ ఘనీభవించి ఉన్న మూఢవ్యతిరేకతను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అదే సందర్భంలో సాధారణ పేద యువతీయువకుల మధ్య పెరుగుతున్న కులాంతర వివాహాల సంఖ్యను కూడా లెక్కల్లోకి తీసుకోకుండా ఉండలేం. కొద్ది నెలల క్రితం ఏర్పాటైన కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం సమావేశాలకు హాజరువుతున్న వారి సంఖ్య ఈ విషయాన్ని చాటిచేప్తోంది. రిజర్వేషన్లు కింది కులాల్లో కొన్ని కుటుంబాలకే ఉపయోగపడ్తున్నాయని, ఉపయోగించు కొన్న కుటుంబాలే మళ్లీ మళ్లీ ఆ సౌకర్యాన్ని ఉపయోగించు కొంటున్నాయన్న వాదన కూడా పరిశీలించ తగిందే.
v  ఇందులో కొంత నిజమున్నా పూర్తి వాస్తవం కాదు. రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉద్యోగాల్లో ప్రవేశిస్తున్న వారిలో మొదటి తరం వారు లేరన్న భావన ఎంత తప్పో మనకు తేలిగ్గానే తెలిసి పోతుంది. మనకు తెలిసిన కుటుంబాల నుండి ఎంతమంది పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో, ఉన్నత విద్య కోసం యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారో కాస్త పరికిస్తే అర్ధం అవుతుంది. రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రవేశించిన వారిలో మొదటి తరమే గణనీయంగా ఉంటుంది. విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల దేశంలో వినియోగ దార్ల సంఖ్య పెరిగింది. వినియోగదార్ల సంఖ్య పెరగడం, వారి కొనుగోలు శక్తి పెరగడం దేశ ఆర్ధిక వ్యవస్థ ముందుకు వెళ్లడానికి కారణం కాకుండా ఎలా ఉంటుంది. ఆర్ధిక వ్యవస్థ ఈ పద్ధతిలో ముందుకు వెళ్లడం వల్ల కింది కులాల వారి జీవితాలు ఎప్పటికీ సమూలంగా బాగుపడేను? ఇది కూడా ఒక ప్రశ్న.
v  అయితే ఈ ప్రశ్నకు రిజర్వేషన్లు అది నిష్ప్రయోజనమని భావించడం, వాదించడం సమాధానం కాజాలదు.
వర్ణాశ్రమధర్మ రిజర్వేషన్లు భారతదేశానికే పరిమితం కాలేదు. అన్ని ఖండాల్లోనూ, అన్ని రాజ్యాల్లోనూ ఇది మనకు కన్పిస్తుంది. ఈజిష్షియన్‌ రాజ కుటుంబానికి చెందిన వాడు కాడని తెలిసిన వెంటనే మోజెస్‌ స్థానం ఎక్కడ నుండి ఎక్కడికి పడిపోయిందో మనకు తెలుసు. అతన్ని రాజ్యబహిష్కరణ చేశారు. పాములు, తేళ్లు మాత్రమే బతకగల ఎడారికి ప్రవాసం పంపారు. అలాంటి ఈజిష్పియన్లను రోమన్లు ఎంత తక్కువ చేసి చూశారో చెప్పే ఉదంతాలు చరిత్రలో ఎన్నో. మిగతా యూరోపియన్‌ జాతులను కూడా రోమన్‌రాజులు తక్కువ చేసే చూశారు. తమ ప్రజలకు అదే చెప్పి నమ్మించారు.
v  తమ పెత్తనాన్ని నిలువు కొన్నారు. హిట్లర్‌ చేసిందీ అదే. మొగల్‌ రక్తం అన్న భావన మొగల్‌ సామ్రాజ్యన్ని సుదీర్ఘకాలం కాపాడింది. సింహాసనాల కోసం తిరుగుబాట్లు మొగల్‌ రాజవంశీకుల మధ్య మాత్రమే జరిగాయి. చివరి దశలో మాత్రమే రాజవంశీకులు కాని వారు తిరగబడ్డారు. మొగల్‌ రక్తమే తనలోనూ ఉందని భావించే హైదరాబాదు నవాబులైన అసఫ్‌ జాహీల్లో కూడా మొదట్లో తిరుగుబాట్లు రాజవంశీకుల మధ్యే జరిగాయి. రక్తం, జాతి, రంగు అన్న అభిప్రాయాలు వాటి పట్ల సృష్టించబడిన దురాభిమానం, విధేయత పాలకులకు ఎంతగానో ఉపయోగపడింది. మన దేశం దగ్గరికి వచ్చేసరికి వాటి అదనంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో కన్పించని అంటరాన్ని తనాన్ని, ముట్టుకొన్నా, చూసినా మైలబడి పోతారన్న భావనను అదనంగా జోడించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అవసరం మనదేశంలో మరింత తప్పనిసరి. రిజర్వేషన్లు అన్నవి భారత్‌కు మాత్రమే పరిమితమయినవి కావు.
v  అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో రిజర్వేషన్లు, సంరక్షణలు కొనసాగుతున్నాయి. రంగు, భాషా, సంఖ్య రీత్యా మైనారిటీలైన తమ దేశ పౌరుల మధ్య ఉన్న అసమానతలను ఆ దేశాలు కూడా గమనించాయి. అందుకనే ప్రత్యేక సంరక్షణలు ప్రోత్సాహాకాలు కన్పించాయి. ఇన్ని కల్పించిన తర్వాత కూడా పశ్చిమదేశాల్లో నల్లజాతి వారి కాలనీలు, చర్చిలు విడిగానే ఉండటం కన్పిస్తుంది. వివక్ష అన్నది పశ్చిమ దేశాల్లో మనలా తీవ్రరూపంలో నిచ్చెన మెట్ల తరహాలో లేదు. అయినా యూరోపులో నల్లజాతి వారి పరిస్థితి ఇలా ఉంటే కులం, ఆధిక్యత అన్న భావాలు ఇంకా దుర్బేధ్యంగా ఉన్న మన దేశంలో నిమ్నకులాల పరిస్థితి ఎలా ఉంటుందో న్యాయ దృష్టి కలవారు సులభంగానే అంచనాకు రావచ్చు.ఈ స్థితిలో మనదేశంలో ప్రభుత్వరంగం వేగంగా అదృశ్యమవుతోంది. కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా పాలకవర్గ పార్టీ ఏదైనా నూతన ఆర్ధిక విధానాలను నెత్తికెత్తుకొన్నవే. ఈ విధానాలు పరమార్ధం ప్రజల సంపదను ప్రకృతి వనరులను ప్రయివేటు సంస్థలకు, కంపెనీలకు అప్పగించడమే.
v  బ్రహ్మండమైన ప్రభుత్వరంగ సంస్థలు అనేకం హైదరాబాద్‌లోనే మనకళ్లముందు మూతబడి పోయాయి. పోతున్నాయి. విద్యారంగం, వైద్యరంగం, విధ్యుచ్ఛక్తి రంగం అన్ని రంగాల్లోనూ ప్రయివేటీకరణ నిరాటంకంగా సాగుతోంది. కీలక రంగాలను కూడా ప్రయివేటీకరణ వైపు నెట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేడు నెహ్రూ విధానాలపై జాతీయస్థాయిలో సమావేశాలను జరపాలని నిర్ణయించుకోవడం హాస్యాస్పదం. బిజెపిదీ అదే ధోరణి. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లను పైకి సమర్ధించని పాలకవర్గ పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలను అరికట్టే చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లును స్థాయీ సంఘానికి అప్పగించి, అటకెక్కించిన బిజెపి రిజర్వేషన్ల చట్టాన్ని గట్టిగా అమలు చేస్తుందని గానీ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ఆచరణలో సానుకూలంగా స్పందిస్తుందని గానీ భావించలేము.
v  ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను ఎన్నికల హామీలుగా ప్రకటించినా ఆ పార్టీ ఆచరణలో అందుకు భిన్నంగానే ప్రవర్తిస్తున్నాయి.దేశంలోని ప్రయివేటు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు సమకూర్చే ఆర్థిక వనరులతో నడుస్తున్నవే ప్రయివేటు సంస్థలు నామమాత్రం పెట్టుబడి పెట్టి భారీలాభాలను మూటకట్టుకొంటున్నాయి. ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అయిన పంచభూతాలను అవి తమతో తాము పంచుకొంటున్నాయి. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడ్తుంటే మరోవైపు మెరుపు వేగంలో కొన్ని గుత్తకంపెనీల యజమానులు వేల కోట్లకు యజమానులవుతున్నారు. ఆ కంపెనీలు బ్రహ్మాండంగా ఉత్పత్తులు చేసి ఆ లాభాలను సాధించడం లేదు. ప్రజల ఆస్తులను కైవసం చేసుకొని తమ తెలివితేటలతో, వ్యాపార దక్షతతో చెమటోడ్చి ఇలా లాభాలు సంపాదించినట్లు చెప్పుకొంటున్నాయి.


v  మీడియా కూడా ఇందుకు ఒక సాధనంగా ఉపయోగపడ్తోంది. మీడియాలో తమ పెట్టుబడులను చాపకింద నీరులాగా విస్తరింప చేసుకొంటున్న ఈ కంపెనీలకు నేడు అన్ని అంశాల్లో ఆడించి ఆటగా పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వం రంగం హరించుకుపోతున్న దశలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగానికే పరిమితమయితే లాభం లేదు. ప్రభుత్వరంగంలో రిజర్వేషన్లు న్యాయసమ్మతమే అయితే ప్రయివేట్‌ రంగంలోనూ అవి న్యాయ సమ్మతమే. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుందని, మార్కెట్‌లో పోటీని తట్టుకోలేమని చేసే వాదనలకు ఎలాంటి అర్ధం లేదు. ప్రభుత్వ రంగం సాధించిన ప్రగతి ఏమిటో మనకళ్లెదుట ఉన్నది. పాతాళంలో ఉన్న ఖనిజ సంపదను బయటకు తెచ్చింది ప్రభుత్వ రంగమే. అంతరిక్షంలో అద్భుత విజయాలను సాధించి భారతదేశ పతాకను విశ్వాంతరాలాలకు చేర్చిందీ. ప్రభుత్వరంగమే! ఆ ప్రభుత్వరంగంలో అమలు చేసిన రిజర్వేషన్లు నేడు ప్రయివేటు రంగంలో కూడా అమలు చేయడం తక్షణావసరం. అదొక కర్తవ్యం.

                   ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment