Thursday 9 April 2015

పెరియార్ ఇ.వి.రామస్వామి గారి రచనలు

Tuesday, August 18, 2009

వ్యక్తిత్వాన్న గౌరవించే పెళ్లిల్లు - పెరియార్‌ ఇ.వి. రామస్వామి ...


వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్లిల్లు నుంచి ...
వివాహం అంటే ఏమిటి? ఒక స్త్రీ ఒక పురుషుడు వైవాహిక జీవితంలోకి ప్రవేశించటానికి అంగీకరించి ఆ విధంగా ప్రకటించటమే వివాహం. అయితే పెళ్లిళ్లు అనేక రకాలుగా జరుగుతాయి.
ఇన్ని రకాల వివాహాలు జరగాల్సిన అవసరం వుందా? ఈ ప్రశ్నకు ఏ ఒక్కరూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.
...
ముహూర్తం, నక్షత్రం, లగ్నం అనేవి తమిళ పదాలు కావు. తమిళులకు తమవైన సంవత్సరాలు లేవు. సంవత్సరాలకు చెప్పే కథే అసభ్యకరమైనది. నారదుడి, కృష్ణుడి కలయిక (ఇద్దరూ మగవారే) మూలంగా 60 మంది పిల్లలు పుట్టుకొచ్చారనీ... వారి పేర్లే సంవత్సరాలనీ భాగవతం తదితర పురాణాలు చెబుతున్నాయి. ఇధ్దరు మగవారి కలయిక మూలంగా పిల్లలు పుట్టారని చెప్పడం ఎంత అసంబద్ధమూ, ఎంత అసభ్యకరమో మనకు తెలుసు.
...
వివాహ ఆహ్వాన పత్రికల్లో ''కన్యాదాన ముహూర్తం'' లేదా ''తారా ముహూర్తం'' ''వివాహ శుభ ముహూర్తం'' వంటి శీర్షికలుంటాయి. కన్యాదానం అంటే కన్యను మరొకరికి దానంగా, బహుమతిగా ఇవ్వడం.నేటి పెళ్లి కుమార్తెలు దీనికి అంగీకరిస్తారా?
...
మన నాగరికతకు, సంప్రదాయానికి సరిపడనందున సాంప్రదాయ వివాహాలలోని అనేక పద్ధతుల్న మనం విసర్జించాము. వైదిక సంప్రదాయం ''వేద'' నుంచి జనించింది. వేద అనే పదం బ్రాహ్మణులచే సృష్టించబడి, మనపై రుద్దబడింది.
వేదాలను ఇతరులు చదవకుండా వారు అనేక కఠినమైన నిబంధనలు ఏర్పరిచారు. ఏ బ్రాహ్మణేతరుడైనా వేదాలను చదివితే అతని నాలుక కత్తిరించాలన్నారు. బ్రాహ్మణులు వేదాలు చదువుతుండగా ఎవరైనా వింటే వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని నిర్ణయించారు. ఈ విధమైన నియమాల ద్వారా వారు ప్రజలను భయకంపితులను చేసి, ప్రజల్ని వేదాలు చదవకుండా అందులో ఏముందో తెలుసుకోడానికి వీలు లేకుండా చేశారు....
వేదలలో ఏమున్నదనేది నేడు బహిరంగ రహస్యం. అందువల్ల నేటి సాంప్రదాయాలకు వేదాలను అనుసంధానించడం కేవలం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. వైదిక సాంప్రదాయం పేరిట నేడు జరుగుతున్నదంతా బ్రాహ్మణులచే సృష్టించబడిన ఓ ఇంద్రజాలం మాత్రమే.... పురాణాలన్నీ బ్రాహ్మణులచే సృష్టించబడిన కాకమ్మ కథలే. అవి వాస్తవాలు కావు. బ్రాహ్మణుల సంస్కృతినీ, వారి గొప్పదనాన్నీ వర్ణించడానికే పురాణాలు రాయబడ్డాయి
...
ఈ పూజారులేమిటి? మనకు అర్థం కాని, తెలియని భాషలో పురోహితుడు మాట్లాడుతుంటాడు. అసలు ఆవిధమైన కర్మకాండ, వైదిక క్రియలను ఎందుకు పాటించాలో అతనికే తెలియదు. మనలను వాటిని పాటించమని మాత్రం చెబుతాడు. మన నుంచి డబ్బు గుంజుతాడు. మనం అతని పాదాలపై పడటమే కాక నూతన వధూవరులను కూడా అతని పాదాలపై పడమని కోరతాం. ఈ పూజారులను మించిన ద్రోహులు ఎవరైనా వుంటారా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని బాగా ఆలోచించారు? అసలు మనకి పూజారి అవసరమేమిటి?
...
మనం మన వివాహాల్లో చేసిన మొదటి మార్పు ఈ పూజారిని తొలగించడమే. ఏ బ్రాహ్మణున్నైనా మన పెళ్లిళ్లు జరిపించటానికి ఆహ్వానించే ప్రశ్నే లేదు.
ప్రజల్ని ఎక్కువ, తక్కువ వారిగా విభజించే విధానానికి మనం వ్యతిరేకం. బ్రాహ్మణులపై మనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మనం చేస్తున్నదల్లా ఏమిటంటే మనం పుట్టుకతోనే తక్కువ జాతి వాళ్లం అన్న మాటని ఒప్పుకోకపోవడమే. అదేవిధంగా నెయ్యి వంటి విలువైన వాటిని మనం మూర్ఖంగా అగ్నికి ఆహుతి చేయడాన్ని కూడా ఒప్పుకోం. అవన్నీ అర్థరహితమైనవి.
...
కుల వ్యవస్థను శాశ్వతం కావించడానికే ఈ వైదిక కర్మకాండ సృష్టించబడింది. ఈ కర్మకాండ అవసరం మనకు ఏమిటి? దీని వల్ల మనకు జరిగే లాభమేమిటి? ఎవర్ని ప్రశ్నించినా మనకు లభించే సమాధానం ఒక్కటే. ''మన కులంలో ఇది సనాతనంగా వస్తున్న ఆచారం!''
...
మార్పు అనివార్యం...మనం మార్పును కోరుకుంటాం. కాలంతో పాటు పరుగెత్తుకుని వచ్చే మార్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
మన వివాహాలలో మన తార్కిక దృష్టికి అహేతుకంగా కనిపించే ప్రతిదాన్నీ తిరస్కరిస్తాం.
మార్పులు సహజసిద్ధం. ఎవ్వరూ వాటిన ఆపలేరు. ఏ సాంప్రదాయవాదైనా జరుగనున్న మార్పులకు నేడో రేపో తలవంచాల్సిందే.

వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్ళిళ్లు
- పెరియార్‌

ఆంగ్ల మూలం:Self Respect Marriages, Published by Periyar Self-Respect Propaganda Institute, Madras-7
ప్రథమ ముద్రణ: 1995
పునర్ముద్రణ: 2000
36 పేజీలు, వెల: రూ.10

Friday, May 22, 2009

పెరియార్‌ జీవితం - ఉద్యమం... వి.ఎస్‌. నైపాల్‌



పెరియార్‌ జీవితం - ఉద్యమం
- వి.ఎస్‌. నైపాల్‌


పెరియార్‌ గురించీ, ఆయన చేపట్టిన విలక్షణమైన ఉద్యమం గురించీ తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం కొంతవరకు దోహదం చేస్తుంది. నిజానికి ఇది వి.ఎస్‌. నైపాల్‌ రాసిన ''ఇండియా: ఎ మిలియన్‌ మ్యూటినీస్‌ నౌ'' అన్న బృహత్‌గ్రంథంలోని ఒక చిన్న అధ్యాయం. భారతదేశ పర్యటనలో భాగంగా 1988లో మద్రాసులో అనేకమంది పెరియార్‌ అనుయాయుల్ని, డిఎంకె ప్రతినిధులను కలుసుకుని ఆయన తన అనుభవాలను గ్రంథస్తం చేశారు.

పెరియార్‌ 1879లో అంటే గాంధీ పుట్టిన పదేళ్ల తరువాత జన్మించాడు. ఆయన రాజకీయ జీవితం 1919లో ప్రారంభమై 1973లో చనిపోయే వరకూ సుదీర్ఘకాలం కొనసాగింది. గాంధీ పూర్తిగా శాఖాహారి. పెరియార్‌ మాంసాహారి. భోజనప్రియుడు. పొట్టేలు మాంసం, ఎద్దు మాంసం, పంది మాంసం ఇష్టపడేవాడు. ఆయనకు తిండి విషయంలో ఎట్లాంటి నియమాలూ వుండేవి కావు. గాంధీ ఆస్తికుడు. పెరియార్‌ నాస్తికుడు.

గాంధీకి పూర్తి భిన్నంగా కనిపించినప్పటికీ, గాంధీని ఆయన అన్నివిషయాల్లో గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లక్ష్య సాధనకు కృషి చేయడంలో, చెప్పింది స్వయంగా ఆచరించడంలో, దైనందిక వ్యవహార శైలిలో పెరియార్‌ గాంధీ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. పెరియార్‌లో భోజన ప్రియత్వం, మాంసాహార అ లవాటు, మొండితనం వంటి లక్షణాలు ఎన్ని వున్నా ఒక విధమైన నిర్మలత్వం కూడా కనిపిస్తుంది. ఆ నిర్మలత్వమే పెరియార్‌కు ''యాంటీ గాంధీ'' రూపాన్నిచ్చింది అంటారు నైపాల్‌.

పెరియార్‌ బ్రాహ్మణేతరుల దేవాలయ ప్రవేశ హక్కు కోసం పోరాడారు. స్వాభిమాన ఉద్యమాన్ని నిర్వహించాడు. నాస్తికత్వాన్ని ప్రచారం చేశారు. విగ్రహారాధనను, మూఢనమ్మకాలను నిరసించాడు, కుల నిర్మూలనకు పాటుపడ్డాడు, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ల ముందరి బోర్డుల్లో శాఖాహారానికి పర్యాయపదంగా ''బ్రాహ్మణ'' అన్న పదాన్ని, మాంసాహారానికి పర్యాయపదంగా ''మిలిటరీ'' అన్న పదాన్ని వాడడాన్ని నిరసించి ఆ పదాలను తొలగింపజేశాడు. వినూత్న స్ఫూర్తితో ద్రవిడ ఉద్యమం నిర్మించాడు.

డెబ్బై ఏళ్ల వృద్ధాప్యంలో పెరియార్‌ ముఫ్ఫై ఏళ్ల మణ్యమ్మాయ్‌ అనే మహిళను ద్వితీయ వివాహం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. దానిమూలంగా ఎందరో ఆయనకు దూరమైపోయారు.చివరికి ద్రవిడ స్వాభిమాన ఉద్యమంలో చీలికకు కూడా దారితీసింది. మణ్యమ్మాయ్‌ తల్లిదండ్రులు పెరియార్‌ అభిమానులు. వెల్లూరుకు వెళ్లినప్పుడు ఆయన ఎక్కువగా వారి ఇంట్లోనే బస చేసేవారు. మణ్యమ్మాయ్‌ టీచర్‌ ట్రెనింగ్‌ పూర్తిచేసింది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకొమ్మని ఎంత బలవంతపెట్టినా ఒప్పుకునేది కాదు. చివరికి పాతికేళ్ల వయసులో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి మరో టీచరు ఇంట్లో ఆశ్రయం తీసుకుంది. ఆమెను పెరియార్‌ తన కార్యదర్శిగా నియమించుకున్నాడు. ఆమె ఆయనకు ఒక నర్స్‌గా కూడా సపర్యలు చేసేది. దాదాపు ఆరేళ్ల తరువాత వారిరువురూ వివాహం చేసుకున్నారు. పెరియార్‌ వద్ద కోట్ల ఆస్తి వుండేది. ఆ ఆస్తి తన బంధువుల పాలు కాకుండా పూర్తిగా తన ఉద్యమానికే ఉపయోగపడాలనేది ఆయన కోరికనీ, అందుకే ఆయన మణ్యమ్మాయ్‌ని పెళ్లి చేసుకున్నాడని ప్రతీతి.

''ప్రపంచం ఇంకా గాఢాంధకారంలోనే వుంది
కులాన్ని నమ్మే జనానికి ఇంకా నూకలు పుడుతూనే వున్నాయి
మతం ద్వారా ప్రజల్ని బెదిరించే వ్యక్తులు ఇంకా బలిసిపోతూనే వున్నారు
ఈ జిత్తులమారి మోసాలకు అంతమెప్పుడు?
కులం, మతం అంతరించిపోనంతకాలం...
స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దయ్యాలు మాత్రమే అనుభవిస్తాయి!''


- భారతీ దాసమ్‌ (పెరియార్‌ స్వాభిమాన ఉద్యమంలో ఒక విధంగా ఆస్థాన కవి)

వి. ఎస్. నైపాల్ (సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్) 1932 లో ట్రినిడాడ్ లో జన్మించారు. అనేక కాల్పనిక, కాల్పానికేతర రచనలను వెలువరించారు. ఇటీవలి అయన రచనల్లో An Area of Darkness, India : Wounded Civilization, India: A Million Mutinies Now , Beyond Belief: Islamic Excursions ప్రముఖ మైనవి. In a Free State అన్న నవలకు 1971 లో బుకర్ ప్రైజ్ లభించింది. 2001 లో నోబెల్ ప్రైజ్ కూడా ఆయనను వరించింది.


పెరియార్‌ జీవితం - ఉద్యమం
-వి.ఎస్‌.నైపాల్‌
ఆంగ్ల మూలం : India: A Million Mutinies Now, V.S.Naipaul, Minerva, India 1991.

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


ప్రథమ ముద్రణ: 1999
26 పేజీలు, వెల: రూ.15/-
............................

Tuesday, April 21, 2009

పుట్టుక, పెళ్లి, చావు వంటి సందర్భాలలో ఖర్చులని, కర్మకాండలని, మూఢనమ్మకాలని నిరసించిన పెరియార్‌


పెరియార్‌నామా ...కె. వీరమణి, పెరియార్‌

పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయకర్‌ ఆలోచనలు, జీవితం, కృషి గురించి క్లుప్తంగా పరిచయం చేసే చిరుపుస్తకమిది. గాంధీకి 'మహాత్మా' లాగా ఇవిఆర్‌ కి 'పెరియార్‌' అనేది గౌరవనామం. పెరియార్‌ అంటే గొప్ప వ్యక్తి అని అర్థం. ఆపేరుతోనే ఆయన సుప్రసిద్ధులు.

పెరియార్‌ 1879 సెప్టెంబర్‌ 17న తమిళనాడులో దైవభక్తి, మతవిశ్వాసాలు మెండుగావున్న ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే ఇంట్లో వాళ్లంతా భక్తి శ్రద్ధలతో గుళ్లూ గోపురాలచుట్టూ తిరుగుతూ మతపరమైన గోష్టుల్లో పాల్గొంటూ వుంటే ఆయనకు మాత్రం చిన్నప్పటినుంచే ప్రతి అంశాన్నీ హేతువాద దృక్పథంతో పరిశీలించడం, ప్రశ్నించడం అ లవాటైంది. పండితుల ప్రసంగాలలోని పరస్పర విరుద్ధమైన అంశాల్ని నిర్మొహమాటంగా ఎత్తి చూపేవాడు. అసంబద్ధ విషయాలను అపహాస్యం చేసేవాడు.

కొంతమంది స్వార్థపరులు, మతాన్ని ఒక ముసుగుగా ధరించి అమాయక ప్రజలను వంచిస్తున్నారనీ, దోచుకుంటున్నారనీ ఆయన యుక్తవయసులోనే గ్రహించాడు. మూఢవిశ్వాసాలకు, పూజారుల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతపరచాలని నిర్ణయించుకున్నాడు.

రాజాజీ ప్రోద్బలంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. సహాయనిరాకరణోద్యమంలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాడు. కేరళలో దళితుల హక్కులకోసం పెద్ద ఎత్తున సాగిన వైకోం సత్యాగ్రహంలో, అంటరానితన నిర్మూలనోద్యమంలో పాల్గొన్నాడు. కానీ గాంధీ ఆదర్శాలలోని డొల్లతనాన్ని, కాంగ్రెస్‌లో అగ్రకుల ఆధిపత్యాన్ని గుర్తించి అందులోంచి అనతికాలంలోనే బయటికొచ్చాడు. 1929లో బ్రాహ్మణేతర వెనుకబడిన తరగతులవారితో స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మతం పేరిట, దేవుడి పేరిట సాగుతున్న దోపిడీని నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేశాడు. పుట్టుక, వివాహం, చావు వంటి సందర్భాలలో ఎలాంటి ఆచారాలను, కర్మకాండను నిర్వహించరాదనీ, అర్థంకాని సంస్కృత శ్లోకాల తంతుని కొనసాగించరాదని, జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాలనుంచి బయటపడాలని ప్రచారం చేశాడు. అంటరానితన నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా దళితులు ముస్లిం మతంలోకి మారడాన్ని ప్రోత్సహించాడు. జస్టిస్‌ పార్టీనుంచి బయటికొచ్చి 1944లో ద్రావిడార్‌ కజగన్‌ (డికె) పార్టీని స్థాపించాడు. తరువాత దానిలోంచే ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐడిఎంకె) పార్టీలు ఆవిర్భవించాయి.

ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్‌ అనువాదాల్ని లోగడ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిషేదించింది. ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన కారణాలేమీ కన్పించడం లేదని తీర్పుచెప్పింది.

పెరియార్‌ నామా
-కె.వీరమణి, పెరియార్‌

పెరియార్‌ దృష్టిలో ఇస్లాం ... జి. అ లాయ్‌సియస్‌ ... తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార ...


పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయకర్‌ (1879 - 1973) పేరు వినగానే చాలా మందికి ఒక కరడు గట్టిన ''నాస్తికుడు'' అన్న భావన కలుగుతుంది.

అయితే ఆయన దేవుడిని నమ్మని మాట, ప్రత్యేకించి రకరకాల రూపాల్లో అసంఖ్యాకంగా వున్న హిందూ దేవుళ్లని ఏవగించుకున్న మాట నిజమే అయినా పెరియార్‌ లక్ష్యం నాస్తికత్వ ప్రచారం కానేకాదు.

ఈ దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడం బ్రాహ్మణీయ కులవ్యవస్థనూ, దోపిడీమయమైన సాంప్రదాయాలనూ నిర్మూలించడం ఆయన ధ్యేయం.

హిందూమతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు ''దేవుడు ఒక్కడే - మనుషులంతా ఒక్కటే'' అని చాటే ఇస్లాం మతంలో చేరడం మంచిదని బోధించాడు. ఆయన భావాలు, ఆలోచనలు ఎప్పుడూ సంచలనమే.

ఇస్లాంపై పెరియార్‌ అభిమానానికి, హిందూమతంపై ఏవగింపుకి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది.

ఇందులోని అధ్యాయాలు:
1. అంటరానివాళ్లు ముస్లింలుగా మారిపోవాలి!
2. ద్రావిడుల జాతిపరమైన నీచ స్థాయికి సరైన విరుగుడు ఇస్లామే!
3. ఇస్లాంలో ఎందుకు చేరాలి?
4. శూద్రుడిగా మిగిలిపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను.
5. మహమ్మద్‌ నబీ కోసం ఓ ఉత్సవం.
7. దేవుడు-మతం.
8. ముస్లింలుగా మారిన ఆరుగురు తమిళనాడు దళితులు.

ఈ పుస్తక రచయిత జి. అ లాయ్‌సియస్‌ న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరు రాసిన '' నేషనలిజం వితౌట్‌ ఎ నేషన్‌ ఇన్‌ ఇండియా '' పుస్తకంతో పాటు ఇతర పుస్తకాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి.

పెరియార్‌ దృష్టిలో ఇస్లాం
కూర్పు: జి. అ లాయ్‌సియస్‌
ఆంగ్ల మూలం: Periyar on Islam, G. Aloysius, Critical Quest, New Delhi, 2004

No comments:

Post a Comment